తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ శాతం పెరగడం శుభపరిణామమన్న రాంచందర్ రావు
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో భారీ పోలింగ్
- ప్రజాస్వామ్యానికి శుభపరిణామమన్న రాంచందర్ రావు
- తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని వ్యాఖ్య
తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమబెంగాల్ లో తొలి విడత ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగింది. అయితే, ఊహించని స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీల్లో టెన్షన్ మొదలయింది. అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతం ప్రస్తుత ప్రభుత్వాలకు అనుకూలంగా పడిందా? లేక వ్యతిరేకంగా పడిందా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
తమిళనాడు (84.80%), పశ్చిమ బెంగాల్ (91.91%) లలో నిన్న జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కావడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం అనేది ప్రజలు ప్రస్తుత వ్యవస్థలో మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఓట్లు ప్రభుత్వాల మార్పు కోసమే పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR)ను ఆయన అభినందించారు. డూప్లికేట్ ఓట్లు, అక్రమ ఓట్లు, చనిపోయిన వారి పేర్లను తొలగించడం ద్వారా 'క్లీన్' ఓటర్ లిస్ట్ సిద్ధమైందని, ఆ తర్వాత కూడా ఓటింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని పేర్కొన్నారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, తద్వారా అసలైన ఓటర్లకు న్యాయం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు.